'బాహుబలి' సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యం సెట్ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిన సంగతే. నూతనంగా రూపు దిద్దుకుంటోన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటికే పలు సంస్థలు తమదైన శైలిలో రూపకల్పనకు నమూనాలు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ నమూనాల్లో సదుపాయాల సంగతి సరే. కానీ ఫ్రంట్ డిజైన్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కొంచెం అసంతృప్తితో ఉన్నారట. అమరావతి నిర్మాణాలు సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డిజైన్స్‌కి 'బాహుబలి' సృష్టికర్త డైరెక్టర్ రాజమౌళి కరెక్ట్ అనీ, అందుకు తన సూచనలు, సలహాలు ఇవ్వాలని రాజమౌళిని కోరడం జరిగింది. గతంలో కూడా అమరావతి విషయంలో రాజమౌళితో చంద్రబాబు సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టేశారు సీఎం. రాజమౌళిని ప్రత్యేక బృందంతో లండన్ పంపించేందుకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు సీఎం. ఇప్పటికే రెండు ప్రముఖ సంస్థలు అమరావతి నిర్మాణానికి కొన్ని రకాల డిజైన్స్ సిద్ధం చేశాయి. అయితే ఎంతో నాలెడ్జ్ ఉన్న ఆర్కిటెక్టులు చేయాల్సిన పనిని ఓ డైరెక్టర్ చేతిలో పెట్టడం ఎంతవరకూ సబబు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి చంద్రబాబు వైఖరితో. రీల్‌పై కనిపించేదంతా ఊహే. నిజం కాదు. 'బాహుబలి' సినిమా కోసం మాహిష్మతి సామ్రాజ్యాన్ని సృష్టించిన గొప్ప డైరెక్టర్ రాజమౌళి. నిజమే ఇది అద్భుతమే కానీ, రీల్ లైఫ్‌లో రాజమౌళి ఊహలు రియల్ అమరావతి విషయంలో వర్కవుట్ అవుతాయా? ఏమో చూడాలిక.