రాజ‌మౌళీ అండ్ కో... మీకు సామాజిక బాధ్య‌త లేదా?

By Gowthami - April 01, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

రాజ‌మౌళి కుటుంబం.. ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా టాలీవుడ్‌ని ఏలేస్తున్నారు. రాజ‌మౌళి దేశం గ‌ర్వించే గొప్ప ద‌ర్శ‌కుడు. అత్య‌ధిక పారితోషికం తీసుకునే భారతీయ ద‌ర్శ‌కుల‌లో రాజ‌మౌళి పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. ఆర్‌.ఆర్‌.ఆర్ కోసం రాజ‌మౌళి తీసుకునే పారితోషికం చెబితే క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి. ఆయ‌న‌కు ర‌మార‌మీ ఈ సినిమా నుంచి క‌నీసం 60 కోట్లు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇక క‌థ‌కుడు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి.. వీళ్లంతా ఓ టీమ్. రాజ‌మౌళి త‌న‌యుడు, కీర‌వాణి అబ్బాయి... వీళ్లూ సినిమాల్లోకి వ‌చ్చేశారు. కుటుంమంతా సినిమాల్లో ఉండ‌డం త‌ప్పు కాదు. అది వాళ్ల అర్హ‌త ఇచ్చిన అవ‌కాశం.

 

కానీ.. సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా జ‌రిగితే స్పందించాల్సిన బాధ్య‌త కూడా వాళ్ల‌కు ఉంది. హుద్ హుద్ లాంటి విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు చిత్ర‌సీమ‌కు రాజ‌మౌళి కుటుంబం చేసిందేం లేదు. స్టార్లంతా భారీ ఎత్తున విరాళాలు అందిస్తుంటే రాజ‌మౌళి కుటుంబం మాత్రం మౌనంగా చూస్తుండిపోయింది. ఇప్పుడూ అంతే. క‌రోనా తో దేశం మొత్తం అల్లాడుతోంది. ఈ ప్ర‌భావం టాలీవుడ్ పై విప‌రీతంగా ప‌డింది. సినీ కార్మికుల్ని ఆదుకోవ‌డానికి సెల‌బ్రెటీలంతా ముందుకొచ్చారు. కోట్లాది రూపాయ‌లు విరాళం ప్ర‌క‌టించారు. వాళ్ల‌లో రాజ‌మౌళి పేరు లేదు. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్క‌రూ సహాయం అందించినట్టు క‌నిపించ‌లేదు.

 

రాజ‌మౌళి కుటుంబానికి సామాజిక బాధ్య‌త లేదా? సినిమా ప‌రిశ్ర‌మ నుంచి తీసుకోవ‌డం త‌ప్ప‌, ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటున్నారా? రాజ‌మౌళి అంటే విప‌రీతంగా అభిమానించేవాళ్లు సైతం రాజ‌మౌళి మౌనాన్ని మాత్రం భ‌రించ‌లేక‌పోతున్నారు. పోనీ.. వీళ్లేమైనా గుప్త దానాలు చేస్తున్నారేమో అనుకోవ‌డానికి కూడా వీల్లేదు. ఈరోజుల్లో చిన్న విష‌యం సైతం కూడా మీడియాకు ముందే లీకైపోతోంది. అలాంటిది రాజ‌మౌళి దానం చేస్తే అది తెలియ‌కుండా ఎలా ఉంటుంది? మొత్తానికి ఈ విష‌యంలో రాజ‌మౌళి అండ్ కో స్ట్రాట‌జీ ఏమిట‌న్న‌ది ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ అంతుప‌ట్ట‌లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS