'బాహుబలి' సినిమాతో టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సూపర్ పాపులర్ అయిపోయాడు డైరెక్టర్ రాజమౌళి. అయితే రాజమౌళి నెక్ట్ సినిమా ఏంటనీ ఊపిరి తీసుకోకుండా ఆలోచించేస్తున్నారు. 'మాహిష్మతీ ఊపిరి పీల్చుకో' అంటూ 'బాహుబలి'లో రాజమౌళి దేవసేన అనుష్కతో చెప్పించిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ, ప్రస్తుతం అందరి దృష్టి రాజమౌళి చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టు పైనే ఉండడంతో యావత్ సినీ ప్రపంచం ఊపిరి తీసుకోలేకపోతోంది. అయితే రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి నోరు విప్పడం లేదు. ఒకవేళ సినిమా అనౌన్స్ చేసినా, ఆ సినిమా సెట్స్ మీదికెళ్లాలి, షూటింగ్ పూర్తి చేసుకోవాలి. రిలీజ్ అవ్వాలి. ఈ ప్రోసెస్ అంతా జరగాలంటే చాలా టైమే పడుతుంది. అందులోనూ రాజమౌళి ఓ పట్టాన ఏదీ అంత సులువుగా తేల్చడాయె. ఈ లోగా జనం మాత్రం క్యూరియాసిటీ ఆపుకోలేకపోతున్నారు. అలా అని ఏదీ ఊహించనూ లేకపోతున్నారు. అయ్యయ్యో ఆడియన్స్‌కి రాజమౌళి ఎంత కష్టం తెచ్చి పెట్టాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్టు గురించే చర్చ జరుగుతోందంటే బాహుబలి సినిమా వేసిన ప్రభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బాహుబలి రాకతో మాహిష్మతి ఊపిరి పీల్చుకుంది. కానీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవాలంటే, 'భళి భళి భళిరా భళీ సాహోరే రాజమౌళి నువ్వేగా పెదవి విప్పాలి..'!