ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుంచి టీజర్ వస్తుందని అంతా ఆశించారు. కానీ లాక్ డౌన్ వల్ల టీజర్ వదలడం కుదరడం లేదని చిత్రబృందం ముందే ప్రకటించేసింది. ఏదో మొక్కుబడిగా టీజర్‌ని విడుదల చేయడం తమకు ఇష్టంచ లేదని, కాస్త ఆలస్యమైనా అభిమానులు పండగ చేసుకునేలానే టీజర్ ఉండబోతోందని ప్రకటించింది. ఇప్పుడు ఆ టీజర్ కోసం రంగం సిద్ధం అవుతోందని సమాచారం. లాక్ డౌన్ ఎత్తేసినా, లేకున్నా జూన్ 1 నుంచి షూటింగులకు అనుమతి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
జూన్ 1 నుంచే షూటింగులు మొదలైతే... వెంటనే ఆర్.ఆర్.ఆర్ టీమ్ బరిలోకి దిగిపోనుంది. ముందు ఎన్టీఆర్ టీజర్ షాట్లు కట్ చేసే ప్లాన్‌లో ఉన్నాడు రాజమౌళి. వీలైనంత త్వరగా ఆ షాట్లు పూర్తి చేసి.. టీజర్‌ని రెడీ చేయాలని చూస్తున్నాడు. ఈ విషయమై రాజమౌళి చిత్రబృందంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా చర్చలు జరిపినట్టు సమాచారం. ఎప్పుడు షూటింగులు మొదలెట్టినా, బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండండి అంటూ... సంకేతాలు పంపాడట. సో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నమాట.