మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆ రోజు కోసం యంగ్ టైగర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారంటే కారణం, ఆ రోజున ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఓ సూపర్బ్ వీడియో ప్రోమో రానుండడమే. మరి, ఈ విషయమై రాజమౌళి ఏమనుకుంటున్నాడు.? ఇదే ప్రశ్న ఆయన ముందుంచితే, ‘మేం అన్నీ ప్లాన్ చేశాం. కానీ, పరిస్థితులు తారుమారయ్యాయి. చరణ్ బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి అన్నీ ముందే సిద్ధం చేసుకున్నాం. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. కంటెంట్ చాలావరకు ఆఫీస్‌లో వుండిపోయింది. పైగా, కొంత షూట్ చేయాల్సి వుంది. చరణ్ వాయిస్ ఓవర్‌తో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసే ప్రోమో అది..’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. కానీ, పరిస్థితులు అనుకూలించేలా కన్పించడంలేదని రాజమౌళి పెద్ద బాంబు పేల్చాడు. దాంతో, అభిమానులు డీలా పడ్డారు.
అయితే, ఏ చిన్న అవకాశం దొరికినా, ఆ అద్భుతమైన గిఫ్ట్ కోసం కష్టపడతామనీ, దాన్నొక ఛాలెంజ్‌గా తీసుకుని అభిమానుల్ని అలరిస్తామనీ రాజమౌళి చెప్పడం కాస్త ఊరట. జనవరి 8వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని విడుదల చేయడానికే సంకల్పించుకున్నామనీ, అయితే పరిస్థితులు ఇంతకు ముందులా ఖచ్చితంగా వుండబోవనీ, లాక్డౌన్ ఎత్తివేస్తే తప్ప పూర్తిస్థాయిలో సినిమా రిలీజ్‌పై స్పష్టత ఇవ్వలేమని రాజమౌళి వ్యాఖ్యానించాడు.