ఎన్టీఆర్ - రామ్‌చరణ్ - రాజమౌళి... తిరుగులేని కాంబినేషన్ ఇది. ఈ సినిమా క్లాప్ కొట్టుకోకముందే... భారీ అంచనాల్ని తన భుజాలపై వేసుకుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించగల కాంబినేషన్ ఇది. మరి ఈ కాంబో కోసం విజయేంద్ర ప్రసాద్ ఎలాంటి కథని ఎంచుకుని ఉంటాడు? ఎలాంటి పాత్రల్ని సృష్టించి ఉంటాడు? అనే ప్రశ్నలు తలెత్తడం సహజం. ఆర్.ఆర్.ఆర్ కథ ఇదని.. ఇది వరకు చాలా వార్తలొచ్చాయి. వాటిపై మెల్లమెల్లగా క్లారిటీ వస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఇది స్వాతంత్రోద్యమ కాలం నాటి కథ. ఎన్టీఆర్ బ్రిటీష్ వారితో పోరాడే ఓ యోధుడు. రామచరణ్ బ్రిటీష్ సైన్యంలో కీలకమైన వ్యక్తి. ఎన్టీఆర్ - చరణ్‌ల మధ్య `నువ్వా నేనా` అనే తరహాలో పోరాటం సాగుతుంటుంది. చివరికి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు కలసి... బ్రిటీష్ వారిపైనే యుద్ధం ప్రకటిస్తారు. అదెలా అనేది వెండి తెరపై చూడాల్సిందే.
ఈసారి రాజమౌళి ఎమోషన్స్‌కి పెద్దపీట వేశాడని, జాతీయవాదాన్ని ఓ కొత్త స్థాయిలో చూపించోతున్నాడని టాక్. మరి ఈ కథ నిజమేనా.. లేదంటే.. కేవలం గాసిప్పా? అనేది తేలాలంటే ఇంకొంత కాలం ఆగాలి.