సినిమాల వరకూ కెప్టెన్ ఆప్ ది షిప్ దర్శకుడే. రాజమౌళి లాంటి దిగ్గజాలు ఉంటే... కెప్టెన్ అనేంటి? అన్నీ ఆయనే. ఆయన కనుసన్నల్లోనే సినిమా మొత్తం నడుస్తుంటుంది. స్టార్ హీరోలతో సినిమా అన్నా, రాజమౌళి మాటే చెల్లుబాటు అవుతుంది. రాజమౌళి ఎంతంటే అంతే. సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా ఆయన నోటి నుంచి రావాల్సిందే. నిర్మాత అయినా సరే, రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేంత వరకూ నోరు మెదపకూడదు. అయితే ఆర్.ఆర్.ఆర్ విషయంలో నిర్మాత డి.వి.వి దానయ్య తొలిసారి నోరు జారారు. తమ సినిమా విడుదల వాయిదా పడిందని ప్రకటించేశారు.
ఓ ఆంగ్ల పత్రికతో దానయ్య మాట్లాడినప్పుడు ఆర్.ఆర్.ఆర్ వాయిదా సంగతి బయటకు వచ్చింది. ఈ సినిమాని వేసవికి వాయిదా వేస్తున్నట్టు ఆయన చెప్పడంతో - రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు డీలా పడిపోయారు. వందల కోట్ల ప్రాజెక్టు ఇది. భారీ అంచనాలున్న సినిమా. వాయిదా మీద వాయిదాలు పడితే... ప్రాజెక్టుపై కాస్త నెగిటీవ్ టాక్ స్పైడ్ అవుతుంది. పైగా ఇలా విడుదల వాయిదా పడిందన్న సంగతి మంచి టైమ్ చూసి చెప్పాలి. కానీ.. దానయ్య నోరు జారారు. దాంతో... రాజమౌళి కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ఇలాంటి ముఖ్యమైన విషయాలు పత్రికలకు లీక్ చేస్తున్నప్పుడు తనని సంప్రదించాలని దానయ్యతో రాజమౌళి చెప్పార్ట. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ విడుదల వాయిదా పడిన సంగతి రూఢీ అయిపోయింది. జనవరి 8న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు 2021 వేసవికి వెళ్లిపోయింది. మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.