ప్రతిష్ఠాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును దర్శకధీరుడు రాజమౌళి అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొని.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తన కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. ''సినిమా యూనిట్ ని మొత్తం నా కుటుంబం అంటూ ప్రతి ఒక్కరూ కామన్ చెబుతుంటారు. కానీ, నా విషయంలో అది కాస్త భిన్నం. ఎందుకంటే నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా సొంత కుటుంబసభ్యులే'' అని పేర్కొన్నారు.
''నేను తెరకెక్కించే సినిమాలకు నా తండ్రి కథ రాస్తుంటారు. పెద్ద అన్నయ్య కీరవాణి సంగీత దర్శకుడిగా, నా భార్య (రమ) కాస్ట్యూమ్ డిజైనర్‌గా, నా తనయుడు కార్తికేయ, వదిన లైన్ ప్రొడ్యూసర్లుగా, సోదరుడి కుమారుడు (కాలభైరవ) గాయకుడిగా, మరో సోదరుడు రచయితగా.. ఇలా వీళ్లంతా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడం కోసం వారు కష్టపడుతున్నారు. నేను ఎలాంటి విజయాలు అందుకున్నా నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటా'' అంటూ కుటుంబాన్ని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి.