టాలీవుడ్ లో మరో పెళ్లి కబురు వినిపిస్తోంది. యువ కథానాయకుడు శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇది లవ్ మ్యారేజ్. తాను ప్రేమించిన అమ్మాయిని, పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోబోతున్నాడు శర్వా. అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోందట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటోంది. మరో రెండు నెలల్లో శర్వా పెళ్లి ఖాయమన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్.
టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వా ఒకడు. తన వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు. శర్వా ఎప్పుడు కనిపించినా .. పెళ్లి ఊసు తీస్తూనే ఉంటారంతా. ఈమధ్య బాలయ్య `అన్ స్టాపబుల్` షోకి వెళ్లినప్పుడు సైతం పెళ్లి ప్రస్తావన వచ్చింది. `ప్రభాస్ పెళ్లయ్యాకే నా పెళ్లి` అంటూ ఆ షోలో నవ్వుతూ చెప్పాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ కంటే ముందే పెళ్లి చేసేసుకొంటున్నాడు. మరి ప్రభాస్ పెళ్లి ఎప్పుడో...? శర్వా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. మరి ఆ డిటైల్స్ ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.