టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి, మన శతృదేశం పాకిస్తాన్‌కి వెళుతున్నాడు. ఎందుకో తెలుసా? 'బాహుబలి' సినిమా ఆయన్ని పాకిస్తాన్‌కి తీసుకెళుతోందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. రాజమౌళి ఏంటి? పాకిస్తాన్ వెళ్ళడమేంటి? 'బాహుబలి' సినిమా ఆయన్ని పాకిస్తాన్‌కి తీసుకెళ్ళడమేంటి? అనే డౌట్స్ మీకు రావడం సహజమే. అయితే విషయం పెద్దదే వుంది.
'బాహుబలి' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల్ని అలరించింది. ది బిగ్గెస్ట్ మూవీగా వసూళ్ళ పరంగా ఇండియాలో రికార్డులు సృష్టించిన 'బాహుబలి' సినిమాకి వివిధ దేశాల్లో ప్రత్యేకమైన గౌరవం లభిస్తోంది. అలా ఈ సినిమాకి పాకిస్తాన్‌లోనూ అరుదైన గౌరవం దక్కబోతోంది. కరాచీలో జరిగే ఓ కార్యక్రమం కోసం 'బాహుబలి' దర్శకుడు రాజమౌళికి ఆహ్వానం అందింది. అదీ అసలు సంగతి. 'బాహుబలి' సినిమా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగే అవకాశం, గౌరవం తనకు దక్కిందనీ, వాటన్నిటిలోకీ తనను బాగా ఉత్కంఠకు గురిచేస్తోన్న టూర్ పాకిస్తాన్‌దేనని రాజమౌళి చెప్పాడు.
నిజమే, పాకిస్తాన్ వెళ్ళడమంటే ఏ భారతీయుడికి అయినా అదో స్పెషల్ అనుభూతి. ఎందుకంటే, ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమే అయినా, ఇప్పుడు పాకిస్తాన్ మనకి శతృదేశం. ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలూ తెంచుకోవడానికి ఎప్పటికప్పుడు బలమైన కారణాలు దొరుకుతూనే వున్నాయి. పాకిస్తానీ నటీనటుల్ని బాలీవుడ్ గతంలో బ్యాన్ చేసింది కూడా.
రాజమౌళి పాక్ టూర్, ఆయనకు ప్రత్యేకమైన అనుభూతినిస్తుందా? వివాదాల్లోకి లాగుతుందా? వేచి చూడాలిక.