'గరుడవేగ' సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు రాజశేఖర్. చాలా కాలం తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఇది రాజశేఖర్‌కి. గతంలో చాలా హిట్ సినిమాల్లో నటించినప్పటికీ, ఈ సినిమా తెచ్చిపెట్టిన విజయం చాలా ప్రత్యేకమైనదనీ, చాలా సంతృప్తినిచ్చిందనీ అంటున్నారు రాజశేఖర్. గతంలో చిరంజీవికి, రాజశేఖర్‌కీ మధ్య విబేధాలుండేవి. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజశేఖర్ - జీవిత దంపతులు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన్ని కలిశారు. సినిమా చూడాల్సిందని కోరారు.
చిరంజీవి 'గరుడవేగ' సినిమా చూస్తానని చెప్పి, సినిమా విజయం సాధించాలని ఆశీర్వదించారు. అలా ఈ సినిమాకి మెగాస్టార్ సపోర్ట్ లభించింది. సినిమా విజయవంతం అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్‌తో కూడా రాజశేఖర్‌కి అంతగా పొసగదు. అయితే ఒకసారి పవన్ కళ్యాణ్‌ని కలిసినా ఆ విబేధాలు తొలిగిపోతాయనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. 'గబ్బర్‌సింగ్' సినిమాలో రాజశేఖర్‌పై సెటైర్స్ వేసిన సీన్ ఉంటుంది. ఆ సీన్ విషయంలో రాజశేఖర్ ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ టైంలో రాజశేఖర్‌కీ చిరంజీవికి మధ్య ఉన్న వైరం దృష్టిలో పెట్టుకుని 'గబ్బర్‌సింగ్' సినిమాలో రాజశేఖర్‌పై ఆ సీన్ క్రియేట్ చేసి ఉంటారనీ ఆయన ఆవేదన చెందుతున్నారు. ఆలీ తనకు మంచి మిత్రుడనీ, అయితే ఆ సీన్‌లో అలీ కూడా నటించడం తనకెంతో బాధ కలిగించిందనీ, చాలాసార్లు ఆలీని ఆ సీన్ విషయమై ఆడగాలనుకుంటూ, అడగలేకపోతున్నాననీ రాజశేఖర్ అన్నారు.
మొత్తానికి ఒకసారి పవన్ కలిస్తే ఈ పొరపొచ్చాలు కూడా వీడిపోయే అవకాశాలు లేకపోలేదు. కాగా 'గరుడవేగ' సినిమా విజయం ఆయన్ని ఇలాంటి ఆవేదనల నుండి విముక్తి పొందేలా చేసిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర్. సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'గరుడవేగ' సినిమా చాలా బాగుందని తాజాగా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా కుమార్, శ్రద్ధాదాస్ హీరోయిన్లుగా నటించారు.