గురువారం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా రాజశేఖర్ వ్యవహారమే హాట్ టాపిక్‌గా వినిపించింది. ఉదయం జరిగిన డైరీ ఆవిష్కరణ సభలో రచ్చ చేసిన రాజశేఖర్.. సాయింత్రానికి తన పదవికి రాజీనామా చేసి మరో షాక్ ఇచ్చారు.'మా' ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఓ లేఖని విడుదల చేశారు. ఈ లేఖలో `మా` అధ్యక్షుడు నరేష్‌పై తన నిరసన గళాన్ని తీవ్ర స్థాయిలో వినిపించారు. నరేష్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, సభ్యుల నిర్ణయాలకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, అసలు ఎవరికీ విలువే ఇవ్వడం లేదని, కించపరిచేలా మాట్లాడుతున్నారని, పదే పదే తప్పులు చేసుకుంటూ వస్తున్నారని, అందరూ ఓ నిర్ణయం తీసుకుంటే, దాన్ని పక్కన పెట్టి సొంత నిర్ణయాల్ని అమలు చేస్తున్నారని, ఈ విషయంలో భావోద్వేగాలకు గురై, సభలో అలా మాట్లాడాల్సివచ్చిందని నరేష్ వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నానని చెప్పుకొచ్చాడు రాజశేఖర్.
Actor Dr.Rajasekher resigned executive vice president post from MAA pic.twitter.com/UAqSIjCusO
— BARaju (@baraju_SuperHit) January 2, 2020
మా ఎన్నికలై, కొత్త కార్యనిర్వాహక వర్గం ఏర్పాటు అయినప్పటి నుంచీ నరేష్‌కీ, రాజశేఖర్‌కీ పడడం లేదు. వీరిద్దరి మధ్య చాలాసార్లు విబేధాలొచ్చాయి. ఇండ్రస్ట్రీ పెద్దలు కలగచేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అది `మా` డైరీ ఆవిష్కరణ సభలో విశ్వరూపం దాల్చింది. చివరికి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితుల్ని తీసుకొచ్చింది.