హీరో రాజశేఖర్ ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడంటూ పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ పరిస్థితి విషమంగా వుందనీ ఆ రూమర్స్‌లో పేర్కొంటున్నారు.
ఈ రూమర్స్‌పై హీరో రాజశేఖర్ స్వయంగా స్పందించాడు. కొన్ని రోజుల క్రితం తన కొత్త సినిమా 'కల్కి' షూటింగ్ సందర్భంగా గాయపడ్డ మాట వాస్తవమే అయినా, ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని చెప్పారు రాజశేఖర్. గాయపడినప్పటికీ, షూటింగ్ ఆపలేదనీ.. చాలామంది నటీనటులు, టెక్నీషియన్ల డేట్స్ సమస్య వస్తుందన్న భావనతో, దెబ్బ తగిలినా షూటింగ్ కొనసాగించామనీ, ప్రస్తుతం కోలుకుని కులు మనాలీలో షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారాయన.
అయితే మార్గమద్యంలో ల్యాండ్ స్లైడ్స్ కారణంగా కొంత సమస్య ఏర్పడిందనీ, రోడ్ క్లియర్ అయ్యాక తాము కులు మనాలి చేరుకున్నామని ఈ ఘటనలో షూటింగ్ సిబ్బందికి ఎలాంటి గాయాలూ కాలేదని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు రాజశేఖర్. 'ఆపరేషన్ గరుడ వేగ' తర్వాత రాజశేఖర్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి'.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్.. అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సన్నిహితుల నుంచి ఆయనకు ఫోన్‌లో పరామర్శలు ఎక్కువ కావడం, అభిమానులు సైతం ఆందోళనలు చెందుతుండడంతో స్వయంగా సోషల్ మీడియా వేదికగా రాజశేఖర్ వివరణ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.