సీనియర్ హీరో రాజశేఖర్ సైలెంట్‌గా కంప్లీట్ చేసిన 'అర్జున' చిత్రం ఇటీవలే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మరీ, హాట్‌గా వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రావల్సింది ఈ సినిమా. అయితే అనుకోకుండా విడుదల పోస్ట్‌పోన్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల డేట్ ఫిక్స్ అయిన కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నిర్వహించేందుకు తాజాగా ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన 'అర్జున' చిత్రం విడుదల అంత సబబు కాదని భావించి నిర్మాతలు వెనక్కి తగ్గారట. సి.కె.ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కన్మని దర్శకుడు. రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో మరియం జకారియా, సాక్షిగులాటీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటించిన నేపథ్యంలో సినిమా రిలీజ్‌కి అనవసరమైన ఇబ్బందులు తలెత్తుతాయనే కోణంలో రిలీజ్‌ని వాయిదా వేసుకున్నామనీ, ఎన్నికల తర్వాత 'అర్జున' ప్రేక్షకుల ముందుకు రానుందని వారు తెలిపారు. 'గరుడవేగ' సినిమాతో హీరోగా బౌన్స్ బ్యాక్ అయిన రాజశేఖర్ ప్రస్తుతం 'కల్కి' సినిమాలో నటిస్తున్నారు. 'అ' ఫేం ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.