'మా' ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్టు సాగాయి. ఈ హోరా హోరీ పోరులో చివరికి సీనియర్ నటుడు నరేష్‌నే విజయం వరించింది. దాదాపు ఎనిమిది వందలమంది ఓటర్లున్న 'మా'లో 480మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లు ఓటేయడానికి తరలివచ్చారు. కానీ.. చాలామంది స్టార్లు ఓటు హక్కుని వినిపియోగించుకోలేదు.
రామ్ చరణ్, బన్నీ, మహేష్, ప్రభాస్, వీళ్లంతా 'మా' ఎన్నికలకు డుమ్మా కొట్టారు. ఆఖరికి బాలకృష్ణ కూడా కనిపించలేదు. వీళ్ల మాట పక్కన పెడితే అసలు హీరోయిన్ల ఊసే లేదు. 'మా' లో దాదాపు 20 మంది హీరోయిన్లకు సభ్యత్వం ఉంది. అనుష్క, తమన్నా, సమంత, రాశీఖన్నా, రకుల్ వీళ్లంతా మా సభ్యులే. అయితే వాళ్లెవ్వరూ ఓటు హక్కు వినిపియోగించుకోవడానికి రాలేదు. అంతెందుకు...? గతంలో అధ్యక్షులుగా పనిచేసిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్‌లు కూడా ఓటు హక్కు ఉపయోగించుకోలేదు.
అంటే వీళ్లందరికీ 'మా' అవసరం లేదా?? 'మా'లో ఉన్న ఎంతో మంది పేదవాళ్ల సాధకబాధకాలు వీళ్లకు పట్టవా? రేపటి రోజున తమకు ఓ సమస్య వచ్చినా, ఓ దర్శకుడితోనో, నిర్మాతతోనో ఇబ్బందులు ఎదురైనా `మా`కు చెప్పుకోగలరా? ఎన్నికలు అనే కాదు.. 'మా' తలపెట్టే ఏ కార్యక్రమంలోనూ స్టార్లు పాల్గొనడం లేదు. కథానాయికల సపోర్ట్ ఏ రూపంలోనూ దక్కడం లేదు. అలాంటప్పుడు వీళ్లంతా సభ్యులుగా కొనసాగే అవసరం ఉందా? ఈ విషయం `మా` కొత్త కార్యానిర్వాహక వర్గమే తేల్చుకోవాలి.