మోహన్‌బాబు-రజనీకాంత్‌ల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఏరా.. అంటే ఏరా అనుకునేంత క్లోజ్. వీరిద్దరి అనుబంధానికి, స్నేహానికీ రువుజువలా నిలిచే ఘట్టాలెన్నో. వీరిద్దరి బంధానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది `పెదరాయుడు` సినిమా. ఇదో తమిళ చిత్రానికి రీమేక్. తమిళ సినిమా చూసిన రజనీకాంత్ రైట్స్ కొనేశారు. తెలుగులో ఆయనే నిర్మించాలన్న ఆలోచన. అయితే... ఇది మోహన్‌బాబుకి అయితే బాగుంటుందనిపించింది. అందుకే మోహన్ బాబుని పిలిచి సినిమా రైట్స్‌ని ఆయన చేతిలో పెట్టారు. 'ఈ కథ బాగుంది. తెలుగులో బాగా ఆడుతుంది.
నువ్వే రీమేక్ చేసుకో. కావాలంటే పాపారాయుడు పాత్రలో నేను నటిస్తా' అంటూ మాట ఇచ్చేశారు. అప్పటికి మోహన్ బాబు ఖాతాలో వరుసగా ఫ్లాపులున్నాయి. నిర్మాతగానూ లాస్ అయ్యారు. చేతిలో డబ్బుల్లేవని తెలుసు. అందుకే ఓరోజు. మోహన్‌బాబు చేతిలో 45 లక్షలు పెట్టి, 'ఇది అప్పు అనుకో.. నీకు డబ్బులు వచ్చాక తిరిగి ఇద్దువుగానీ' అన్నార్ట. నిజానికి 'పెదరాయుడు' సినిమాకి మోహన్‌బాబునే నిర్మాత. రైట్స్ ఇచ్చినందుకు, పాపారాయుడు పాత్ర చేసినందుకు.. మోహన్‌బాబు రజనీకి డబ్బు ఇవ్వాల్సింది పోయి, తిరిగి ఆయనే.. ఇచ్చారు. రజనీ నమ్మకం నిజమై, పెదరాయుడు సూపర్ డూపర్ హిట్టయ్యింది. మళ్లీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నిలబడింది. మోహన్ బాబు సినీ చరిత్రలో పెదరాయుడు ఓ మైల్ స్టోన్‌గా మారింది. ఇదంతా.. రజీనీ వల్లే సాధ్యమైంది.