తమిళనాట ఓ సంచలన వార్త గత కొంతకాలంగా హల్ చల్ చేస్తోంది. సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటిస్తారన్నది ఆ వార్త సారాంశం. అయితే... ఇది నిజం అవుతుందా? లేదా? అనే అనుమానం అందరిలోనూ వుంది. ఎందుకంటే వీరిద్దరూ కలిసి నటించి చాలా ఏళ్లయిపోయింది. పైగా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ. రాజకీయపరంగానూ.. వేర్వేరు దారుల్లో ఉన్నారు. అందుకే ఇది గాసిప్ ఏమో అని లైట్ తీసుకున్నారు.
కానీ... ఈ సినిమా రావడం ఖాయమని తేలిపోయింది. ఈ చిత్రానికి `ఖైది` ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారు. ఈ విషయాన్ని లోకేష్ అంగీకరించారు కూడా. అయితే.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో వుందని, ఇద్దరికి సంబంధించిన కథ తయారవుతోందని, నిర్మాతలే ఈ విషయాన్ని త్వరలో ప్రకటిస్తారని చెప్పారు లోకేష్. అంటే.. ఈ భారీ మల్టీస్టారర్‌కు అంకురార్పణ మొదలైపోయినట్టే. కమల్, రజనీ `ఊ` అంటే సరిపోతుంది. మరి ఆ శుభముహూర్తం ఎప్పుడో?