రజనీకాంత్ అభిమానులే కాదు.. యావత్ భారతీయ చిత్రసీమ '2.ఓ' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో శంకర్ ఎలాంటి అద్భుతాన్ని, విజువల్ వండర్‌నీ చూపిస్తాడో అంటూ.. ఆత్రుత కనబరుస్తోంది. శంకర్ విజువల్ సెన్స్ అద్భుతం. రోబో ఈ విషయాన్ని తేల్చి చెప్పేసింది. మరి '2.ఓ'లో ఇంకెన్ని అద్భుతాలు ఉంటాయో అనే అంచనాలు ఏర్పడడం సహజం. ఈ సినిమాని నిలబెట్టేది కూడా విజువల్ ఎఫెక్ట్సే. అలాంటి వీఎఫ్ఎక్స్ సరిగా రాకపోతే పరిస్థితి ఏమిటి?? ఆ ప్రభావం సినిమాపై తప్పకుండా పడుతుంది. రోబో 2.ఓ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్లు వింటే... ఈ సినిమాలో గ్రాఫిక్స్ అనుకున్నంత బాగా రాలేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వడం సహజం.
ఈనెల 29న విడుదల కానుంది. ఈసందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడే విజువల్ ఎఫెక్స్ పై రజనీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ తాను అనుకున్న స్థాయిలో రాలేదని శంకర్ టెన్షన్ పడుతున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ''రోబో కంటే ఈ సినిమాని శంకర్ చాలా ధీమాతో తీశాడు. కాకపోతే చివర్లో బాగా ఒత్తిడికి గురయ్యాడు. తను అనుకున్న స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ కుదరకపోవడమే అందుకుకారణం'' అని షాకింగ్ కామెంట్స్ చేశారు రజనీ.
దీనిపై శంకర్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఓ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ తమకు చివరి నిమిషాల్లో హ్యాండిచ్చిందని, అందుకే మరో కంపెనీతో పనిచేయాల్సివచ్చిందని, ఆ సమయంలో ఒత్తిడికి గురయ్యానని, అందుకోసమే సినిమా విడుదల ఆలస్యమైందని, బడ్జెట్ కూడా పెరిగిందని చెప్పాడు శంకర్. రజనీ అన్నట్టుగా విజువల్ ఎఫెక్ట్స్ సరిగా రాకపోతే మాత్రం... ఈ సినిమా పలితం తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ గ్రాఫిక్స్ సరిగా కుదరక మిస్ ఫైర్ అయితే అప్పుడు శంకర్ ఎలాంటి సమాధానం చెప్పి తప్పించుకుంటాడో చూడాలి.