తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకోసారి అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఏప్రిల్ 2వ తేదీన అభిమానులతో సమావేశమంటూ సమాచారమందించిన సూపర్ స్టార్, మాట నిలబెట్టుకోలేకపోయాడు. రాజకీయ రంగ ప్రవేశంపై చర్చించడం కోసమని అంతర్గతంగా అభిమానులకు సమాచారం అందింది రజనీకాంత్ నుంచి. అయితే అంతకు ముందే ఆ మీటింగ్ రాజకీయాలకు సంబంధించినది కాదని, కేవలం ఫొటోసెషన్ కోసమేనని చెప్పాడాయన. అది కూడా జరగలేదు. అసలు రజనీకాంత్ ఆ మీటింగ్‌కి రాకుండానే, దాన్ని క్యాన్సిల్ చేసేసరికి అభిమానులు ఆగ్రహావేశాలకు లోనై, దాడులకు పాల్పడ్డారు నిర్దేశిత ఫంక్షన్ హాల్‌పై. ఇంకో వైపున త్వరలో అభిమానులతో రజనీకాంత్ సమావేశమవుతారని ఇంకోసారి సమాచారం రజనీకాంత్ వైపునుంచి వెళ్ళింది. ఇలా పలుమార్లు అభిమానుల్ని గందరగోళానికి గురిచేస్తుండడంపై భిన్నవాదనలు వినిపస్తున్నాయి. ఏమనుకున్నాడో ఏమోగానీ, అభిమానులు తనను క్షమించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన ఆయన నుంచి వచ్చింది. ఈ ప్రకటనతో అభిమానులు ఇంకోసారి షాక్‌కి గురయ్యారు. అందరితోనూ ఫొటోసెషన్ అంటే కుదరని పని అని రజనీకాంత్ పేర్కొనడం ఆశ్చర్యకరం. తమ అభిమాన హీరోతో ఫొటో దిగాలని ప్రతి అభిమానీ అనుకోవడం సహజం. ఫొటోసెషన్ కోసం అభిమానుల్ని కలుస్తున్నానని రజనీకాంత్ స్వయంగా చెప్పి, అది అసాధ్యం అని ఆయనే చెప్పడం వివాదాస్పదమవుతోంది.