రాజకీయాల్లోకి వచ్చేసినట్లే అని రజనీకాంత్ ఎప్పుడో ప్రకటించాడు. ఎప్పటినుండో రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా, అది కార్యరూపం దాల్చలేదు. ఇదిగో పార్టీ అదిగో పార్టీ అంటూ కాలయాపన చేస్తున్నాడాయన. మరో పక్క అనూహ్యంగా కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. పార్టీ కూడా ప్రకటించేశాడాయన. జనంతో మమేకమై జనంలో తిరుగుతూ జనానికి దగ్గరగా పాపులర్ అయిపోయాడాయన. కానీ రజనీకాంత్ ఎక్కడ స్టార్ట్ చేశాడో అక్కడే ఉన్నాడు.
ఎప్పుడెప్పుడు రజనీకాంత్ పార్టీ పెడతాడా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే, రజనీకాంత్‌కి పెద్ద షాక్ తగిలింది. ఇటీవల తమిళనాడును కుదిపేసిన 'తూత్తుకుడి' వ్యవహారంలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడ్డ వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లాడు రజనీకాంత్. ఓ బాధితుడు రజనీకాంత్‌ని చూసి 'ఎవరు నువ్వు?' అని అడిగాడు. దాంతో అంతా షాక్ తిన్నారు. 'నేను రజనీకాంత్‌ని. సినిమా నటున్ని అని రజనీకాంత్ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. ఎందుకంటే రజనీకాంత్ తమిళ సూపర్‌స్టార్.
తమిళనాడులోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో ఆ మాటకొస్తే, దేశ వ్యాప్తంగా రజనీకాంత్ అంటే తెలియని వారుండరు. అయితే రాజకీయాలు వేరు. సినిమా వేరు. ఆ విషయం రజనీకాంత్‌కి 'ఎవరు నువ్వు?' అనే ప్రశ్నతో బాగా అర్ధమై ఉండాలి.