ఈ దీపావళికి `పెద్దన్న`గా రాబోతున్నాడు రజనీ. ఈ సినిమా పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. వింటేజ్ రజనీని చూస్తామన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ఈలోగా రజనీకాంత్ ఆసుపత్రి పాలవ్వడం అందరినీ.... ఆందోళనకు గురి చేసింది. ఇటీవల రజనీకాంత్ అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఓ చిన్న పాటి సర్జరీ కూడా జరిగింది. రజనీ ఆరోగ్యానికి ఏమైందంటూ... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆదివారం రాత్రి ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. `నేను ఇంటికి వచ్చేశా` అంటూ.. రజనీ కూడా ట్వీట్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ఈమధ్య రజనీకాంత్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల అమెరికా వెళ్లి, అక్కడ చికిత్స తీసుకుని వచ్చారు. అయితే... ఇప్పుడు మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో.. ఫ్యాన్స్ లో గుబులు మొదలైంది. రజనీ వయసు 70. అయినా సరే.. ఆయన ఎప్పుడూ జోష్‌లోనే ఉంటారు. తెరపై అంత జోష్ లోఉన్నా.. బయట మాత్రం ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. అందుకే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు రజనీ.