పాపం.. నాని కెరీర్ ఇప్పుడు బాగా టెన్షన్ లో పడిపోయింది. బాక్సాఫీసు దగ్గర వరుసగా ఫ్లాపులు తగిలాయి. వి, టక్ జగదీష్... సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. దాంతో బయ్యర్లు నానిపై కోపం పెంచుకున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తానని నాని మాటిచ్చాడు. తన తదుపరి సినిమా `శ్యామ్ సింగరాయ్`ని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు. డిసెంబరు 24న రిలీజ్‌డేట్ కూడా ఖాయం చేసుకున్నాడు. అయితే ఈ రిలీజ్ డేట్ కి ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయో?
డిసెంబరు 17న పుష్ష విడుదల అవుతోంది. పుష్ష పాన్ ఇండియా సినిమా. దానిపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ష లాంటి భారీ చిత్రానికి కనీసం రెండు వారాల గ్యాప్ అవసరం. కానీ నాని ఓ వారం గ్యాప్ లోనే వచ్చేస్తున్నాడు. మరోవైపు డిసెంబరు 24 పై బాలయ్య కూడా దృష్టి పెట్టినట్టు టాక్. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో `అఖండ` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. ఈసినిమాని డిసెంబరు 24నే విడుదల చేద్దామనుకుంటున్నారట.
ఒకవేళ అఖండ వస్తే.. నాని డ్రాప్ అయిపోవాల్సిందే. ఎందుకంటే.. అఖండపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ రిలీజ్ అయ్యేనాటికి పుష్ష కూడా థియేటర్లలో ఉంటుంది. ఈ రెండు సినిమాల మధ్య నాని నలిగిపోవడం ఖాయం. అందుకే.. శ్యాం సింగరాయ్ వెనక్కి తగ్గుతున్నాడని తెలుస్తోంది. డిసెంబరు దాటితే, నానికి ఫిబ్రవరి వరకూ డేట్లు దొరకవు. ఎందుకంటే జనవరిలో పెద్ద సినిమాలు వస్తాయి. సో.. డిసెంబరు దాటితే.. ఫిబ్రవరి వరకూ ఆగాల్సిందే.