టాలీవుడ్ లో ఓ సరికొత్త సంప్రదాయం ప్రారంభమైంది. రెండు, మూడు అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపి... సంయుక్తంగా సినిమాల్ని తీయడం మొదలెట్టాయి. యూవీ, గీతా ఆర్ట్స్ లు కలిసి కొన్ని సినిమాలు చేశాయి, చేస్తున్నాయి. మహేష్ `మహర్షి`కి ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు కలిసి పనిచేశాయి. ఇక మీదట కూడా ఇదే సంప్రదాయం కొనసాగబోతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు నిర్మాణ సంస్థలు ఒకే వేదికపైకి వచ్చాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలు చేతులు కలిపాయి.
సునీల్ నారాంగ్, రామ్ మోహన్, అగర్వాల్ కలిసి సంయుక్తంగా సినిమాల్ని నిర్మించబోతున్నారు. ``మా రెండు సంస్థల నుంచి స్టార్ హీరోలతోనూ, కొత్తవాళ్లతనూ సినిమాలు వచ్చాయి. వివిధ జోనర్ల కథల్ని అందించాం. ఇప్పుడు మరింత పటిష్టంగా, మరింత భారీ ఎత్తున చిత్రాల్ని నిర్మించబోతున్నాం. త్వరలోనే మా కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటిస్తామ``న్నారు అభిషేక్ అగర్వాల్. ప్రస్తుతం ఓ అగ్ర హీరోతో సినిమా కోసం.. కసరత్తులు జరుగుతున్నాయని, దర్శకుడితో సహా ఆ వివరాలన్నీ త్వరలో ప్రకటిస్తామని నారాయణ్ దాస్ నారాంగ్ తెలిపారు.