సినిమాని రాజకీయాన్నీ వేరు చేయడానికి వీల్లేకుండా సినీ ప్రముఖులు ఆ రెండిటినీ మిక్స్ చేసేస్తున్నట్లుగా కన్పిస్తోంది. తమిళనాడులో కమల్‌హాసన్, రజనీకాంత్ త్వరలో రాజకీయ తెరపై కనిపించబోతున్నారు. అలాగే వారి కొత్త సినిమాలూ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సినిమా, రాజకీయానికి ఉపయోగపడేలా, రాజకీయం కూడా సినిమాకి ఉపయోగపడేలా ఈ ఇద్దరూ తమ తమ వ్యూహాల్ని ఖరారు చేసుకుంటున్నారట.
తెలుగునాట పవన్‌కళ్యాణ్, జనసేన పార్టీ పేరుతో ఈ మధ్యన సందడి చేయడం, అలాగే తన కొత్త సినిమా 'అజ్ఞాతవాసి'ని ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చూశాం. ఇక్కడా సినిమా ప్లస్ రాజకీయం అనే కాన్సెప్ట్‌ని ఉపయోగించినా, అది అంత సత్ఫలితాన్నివ్వలేదు. కానీ తమిళనాడులో మాత్రం రజనీకాంత్, కమల్‌హాసన్ అభిమానులు సినిమా ప్లస్ రాజకీయం ఒకేసారి షురూ చేస్తే వర్కవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. కమల్‌హాసన్ 'విశ్వరూపం-2' సినిమాని ప్రేక్షుల ముందుకు తీసుకురానుండగా, రజనీకాంత్ నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వస్తాయి. అందులో '2.0' ఒకటి కాగా, ఇంకొకటి 'కాలా'.
రజనీకాంత్ '2.0' రిలీజ్‌కి ముందే తన రాజకీయ పార్టీ పేరుని ఖరారు చేయాలనుకుంటున్నట్లు తెలియవస్తోంది. కమల్‌హాసన్ కూడా 'విశ్వరూపం-2' పనులు పూర్తవగానే రాజకీయ పార్టీ పేరు ప్రకటించబోతున్నాడట. ఈ ఇద్దరూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్నే లక్ష్యంగా చేసుకున్నారు. దానికి ఇంకా కొంత సమయం ఉంది. అయితే కమల్‌హాసన్, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకే తన పార్టీని తీసుకొస్తారని గాసిప్స్ వినవస్తున్నాయి.