తమిళ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా వున్న అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది. 2021లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజనీకాంత్ ప్రకటించారు. జనవరీలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని, అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని చెప్పారు.
మొత్తానికి రజనీ రాజకీయంపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమైయింది. జయలలిత మరణంతో తమిళరాజకీయాల్లో కొంత రాజకీయ శూన్యత ఏర్పడింది. శశికళ జైలు పాలైయింది. జయలలిత ఏర్పరిచిన ప్రభుత్వమే కనసాగుతున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ మునపటి ప్రభావాన్ని చూపిస్తుందా లేదో అనుమానం.
ఇలాంటి నేపద్యంలో ఏంజీఆర్, జయలలిత తర్వాత అంతటి సినీ గ్లామర్ వున్న నాయకుడు మరొకరు తమిళరాజకీయాలని శాసించే తరుణమిది. కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ మరీ అంత క్రియాశీలకంగా లేరు. ఇప్పుడు రజనీ తన రాజకీయ ప్రయాణంకు శ్రీకారం చుట్టారు. దీంతో తమిళ రాజకీయం దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది.