సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ఈ మధ్య వరుసగా నిరాశపరుస్తూ వస్తున్నాయి. విడుదలకు ముందు భారీ అంచనాలు విడుదలయ్యాక అంచనాలు తారుమారు.. ఇలాగే జరుగింది వరుసగా 'కబాలి', 'కాలా' తదితర చిత్రాల విషయంలో. అయితే శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'రోబో 2.0'తో రజనీ మళ్లీ అప్‌డేట్ అయిపోయారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో రికార్డులు తిరగ రాశారు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహమే ఆయన తదుపరి చిత్రం 'పేట'పై అంచనాలు పెంచేలా చేసింది.
రజనీ కెరీర్‌లో 'భాషా' చిత్రం సంచలన విజయం అందుకుంది. ఆ తరహాలో 'పేట'పై అంచనాలుండడంతో పాటు, '2.0' విజయం ఈ సినిమా సక్సెస్‌కి ఖచ్చితంగా తోడ్పడుతుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విడుదలకు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ పెద్దగా హడావిడి చేయదలచుకోలేదట. సింప్లీ గ్రాండ్‌గా ఈ సినిమా ఆడియో రిలీజ్‌ని నిర్వహించింది. ఇక ప్రమోషన్స్ విషయంలోనూ పెద్దగా ఖర్చు చేసే యోచనలో చిత్ర యూనిట్ లేదని ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, సూపర్‌స్టార్ సినిమాలపై అనుకోకుండానే విడుదలకు ముందు హైప్ క్రియేట్ అయిపోవడం సర్వ సాధారణ విషయమే. ఇదిలా ఉంటే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సీనియర్ హీరోయిన్లు త్రిష, సిమ్రాన్‌లు ఈ సినిమాలో రజనీతో తొలిసారి జత కడుతున్నారు.