తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ దశలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించిన చర్చ మరింత పెరిగింది. ఈసారి రజనీకాంత్ ప్రత్యక్ష ఎన్నికల్లో దిగుతారని జోరుగా ప్రచారం జగింది. దానిపై పందేలు కూడా కాసుకున్నారు. అయితే.. ఓ వర్గం మాత్రం రజనీ రాజకీయాల్లోకి రావడం అసాధ్యం అని తేల్చేసింది. రజనీకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారం కోసం బయటకు రాలేరని, ప్రజల్లో మమేకం అవ్వలేరని, అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.
రజనీ పేరుతో ఓ లేఖ కూడా ఇటీవల బాగా తిరిగింది. అది రజనీకాంత్ రాయలేదని తేలినా.. అందులోని విషయాలు మాత్రం వాస్తవ దూరం కావు. రజనీ పార్టీ పెట్టడని, ప్రత్యక్ష ఎన్నికల్లో దిగడని అర్థమైపోయింది జనాలకు. అందుకే రజనీకాంత్ సేవల్ని మరో రూపంలో వాడుకోవాలని బీజేపీ పార్టీ భావిస్తోందట. ఈ ఎన్నికల్లో బీజేపీకి రజీనీ బయటి నుంచి మద్దుతు ఇచ్చేలా.. రజనీని పురిగొల్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆర్.ఎస్.ఎస్ సిద్దాంత కర్త ఎస్.గురుమూర్తి ఇటీవల రజనీకాంత్ తో భేటీ అయ్యారని సమాచారం.
ప్రత్యక్ష ఎన్నికలలో రజనీ పాల్గొనకపోయినా, ప్రచారం చేయకపోయినా `బీజేపీని గెలిపించండి` అంటూ అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడితే చాలని ఆ పార్టీ భావిస్తోంది. లేదంటే.. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్ పేరు ప్రకటించాలని, రజనీతో ఒకట్రెండు భారీ మీటింగులు పెట్టించాలని వ్యూహం రచిస్తోంది. రజనీ పార్టీ పెట్టాల్సిన పనిలేదు. అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి సపోర్ట్ చేస్తే చాలు.. బీజేపీ గెలిస్తే.. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదీ.. బీజేపీప్లాను. మరి దీనికి రజనీ ఏమంటాడో చూడాలి.