తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో 2.0' సినిమా విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అయినట్లుగా తాజా సమాచారమ్. అయితే ఇది ఊహించని షాకేమీ కాదు. 2017 దీపావళికి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో విడుదల కాలేదు. ఆ తర్వాత జనవరి 26న విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. ఫిబ్రవరి, మార్చిల్లో అనుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఏప్రిల్‌కి తీసుకొచ్చారు.
దాంతో ఏప్రిల్‌లో విడుదలవుతున్న తెలుగు సినిమాల నిర్మాతలు టెన్షన్ పడిన మాట వాస్తవమే. ఆ సినిమాలు మరేవో కావు, బన్నీ హీరోగా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', మహేష్ హీరోగా తెరకెక్కుతోన్న 'భరత్ అను నేను' సినిమాలు. 'రోబో 2.0' రిలీజ్ డేట్ ఈ సినిమాల విడుదలను భారీగానే టెన్షన్ పెట్టాయి. అయితే ఇంత హడావిడి చేసి, ఈ సినిమా ఏప్రిల్‌లో రావట్లేదని తేలిపోయింది. అంతేకాదు, ఈ పోస్ట్‌పోన్ ఈ సారి ఎప్పటిదాకానో కూడా తెలీడం లేదు. రెండు, మూడు నెలల తర్వాత అంటున్నారు. అంటే అప్పటికి సమ్మర్ సీజన్ కూడా అయిపోతుంది.
అసలింతకీ 'రోబో 2.0' విడుదల ఆలస్యం కావడానికి కారణం ఏంటో తెలీక రజనీకాంత్ అభిమానులు టెన్షన్ ఫీలవుతున్నారు మరో పక్క. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. భారీ బడ్జెట్ అంటే ఆషా మాషీ బడ్జెట్ కాదు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. ఆలస్యం మీద ఆలస్యం జరుగుతుండడంతో సినిమాపై అంచనాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రజనీకాంత్ కదా ఎప్పుడొచ్చాడన్నది కాదు హిట్ కొట్టాడా లేదా? అని లెక్కేసే రోజులు కావివి. సినిమా ఈక్వేషన్స్ మారిపోయాయి.
గతంలో 'కబాలి' విషయంలో ఏం జరిగిందో చూశాం కదా. అయితే 'రోబో 2.0' విషయంలో గ్రాఫిక్సే కారణమా? లేక అంతర్గతంగా ఇంకేమైనా కారణాలున్నాయా? అనేది తెర వెనుక రహస్యం.