తన జీవితంలో మొదటిసారి బయ్యర్లకు వత్తాసు పలుకుతూ.... నాలుగు సానుభూతి డైలాగులు వదిలాడు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలు (బాబా, లింగా, కబాలి వగైరా) కొని భారీగా మోసపోయిన బయ్యర్లు చాలాసార్లు రోడ్డెక్కారు. ''మాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే'' అంటూ ఘొరావ్ చేశారు. బాబా సినిమాకి తప్ప.. ఎప్పుడూ రజనీకాంత్ నుంచి సానుకూల స్పందన రాలేదు. లింగ సినిమా వివాదం నిన్నా మొన్నటి వరకూ కొనసాగింది. అయినా ఎప్పుడూ నోరు విప్పింది లేదు. తాజాగా రజనీకాంత్ బయ్యర్లపై జాలి చూపిస్తూ నాలుగు ముక్కలు మాట్లాడాడు. పెద్ద సినిమాలు భారీ రేట్లకు కొని మోసపోవొద్దని, ఆ సినిమాలు ఫ్లాప్ అయితే భారీగా నష్టపోవాల్సివస్తుందని హితవు పలికాడు రజనీకాంత్. సినిమాని క్రేజ్ చేసుకోవాలన్న ఉద్దేశం నిర్మాతలకు,ఈసినిమా అయినా తమని గట్టెక్కెస్తుందన్న నమ్మకం బయ్యర్లకూ ఉన్నంత వరకూ.. సినిమా రేటు పెరుగుతూనేఉంటుంది. దానికి అడ్డు కట్ట వేయాలంటే ముందు హీరోలే మారాలి. బడ్జెట్‌లు తగ్గించాలి. అందులో భాగంగా పారితోషికాల్నీ తగ్గించాలి. అది చేసేంత గొప్ప గుణాలు మన హీరోలకు ఉండవు. ఇలాంటిడైలాగులు విసరడం తేలికే కదా.. అందుకే ఎన్నయినా చెబుతారు. రజనీకాంత్ సలహా బయ్యర్లు పాటిస్తారా? రోబో 2 వస్తుందిగా. అప్పుడు తెలిసిపోతుంది. బయర్లు రజనీ మాట విన్నారో, లేదో?