సినిమా బాగుంటే రివ్యూలు బాగా వస్తాయి. లేదంటే లేదు. ఇది చాలా సింపుల్ లాజిక్. దాన్ని... సినీ రూపకర్తలు మర్చిపోతున్నారు. మంచి రివ్యూలు వచ్చినప్పుడు `రివ్యూలు ప్లస్ అయ్యాయని` చెప్పేవాళ్లు.. కాస్త నెగిటీవ్ రివ్యూలు వచ్చేసరికి మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తాజాగా `రాజుగారి గది 3` పరిస్థితి కూడా అంతే. ఈసినిమాకి అన్నిచోట్ల నుంచీ నెగిటీవ్ రివ్యూలే వచ్చాయి. దాంతో అటు హీరో, ఇటు అలీ.. ఇద్దరూ రివ్యూ రైటర్లపై ఫైర్ అవుతున్నారు.
బుక్ మై షో యాప్‌లో నెగిటీవ్ రివ్యూలనే హైలెట్ చేశారని, సినిమా బాగున్నా, నెగిటీవ్ ప్రచారం చేయడం బాధగా ఉందని ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు అసహనం వ్యక్తం చేశాడు. అలీ ఓ అడుగు ముందుకేసి.. రివ్యూ రైటర్లను కోన్ కిస్కా గొట్టంగాళ్లు అంటూ సంభోధించాడు. ప్రివ్యూ థియేటర్లలో సినిమా చూడడం వేస్ట్ అని, అక్కడ సినిమా చూస్తున్నవాళ్లు నవ్వకుండా బిగుసుకుపోతారని, నవ్వితే తమ సొమ్ములు పోతాయనుకుంటారని, అందుకే తాను థియేటర్లో చూస్తానని అన్నారు.
తాము సినిమాలు ప్రేక్షకుల కోసం తీస్తున్నామని, రివ్యూ రైటర్ల కోసం కాదని అన్నారు. మరి అలాంటప్పుడు రివ్యూల్ని ఇంత సీరియస్‌గా తీసుకోవడం ఎందుకో మరి. ఇది వరకు రాజుగారి గది కి మంచి రివ్యూలు వచ్చాయి. అప్పుడు రివ్యూ రైటర్లంతా మంచోళ్లు. ఇప్పుడు చెడ్డవాళ్లా? ఇలా మాట మారిస్తే ఎలా రాజుగారూ..??