కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. న్యూ ఇయర్ డేకి అంటే జనవరి 1 వ తేదీన 'అతడే శ్రీమన్నారాయణ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు రక్షిత్ శెట్టి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కన్నడ సినిమా ట్రైలర్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఉండడంతో, తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే, హీరో రక్షిత్ శెట్టి విషయానికి వస్తే, కన్నడ కుట్టి, తెలుగులో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న రష్మికా మండన్నాకి మాజీ ప్రియుడుగా తెలుగు ప్రేక్షకుల నోళ్లలోనూ బాగానే నానాడు.
రష్మిక పుణ్యమా అని అలా పరిచయమైన ఈ యంగ్‌స్టర్ ఇప్పుడు 'అతడే శ్రీమన్నారాయణ' అంటూ సందడి చేస్తున్నాడు. ఈ సినిమాకి తెలుగులో చేస్తున్న ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. అదేదో స్ట్రెయిట్ తెలుగు మూవీ అన్నట్లుగానే ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా, రక్షిత్ శెట్టికి రష్మికను వాడుకోక తప్పడం లేదు. గతంలో రక్షిత్ శెట్టి - రష్మిక లవ్ స్టోరీని ఈ సందర్భంగా కెలికి కెలికి తీస్తున్నారు మన రిపోర్టర్లు. సమాధానం చెప్పాలి కదా.. అయితే, ఇక్కడ బోలెడంత క్రేజ్ ఉన్న రష్మిక పట్ల ఏ మాత్రం నెగిటివిటీ ఫీలింగ్ రాకుండా, మనోడు జాగ్రత్త పడుతున్నాడు. రష్మికతో లవ్, బ్రేకప్ విషయాల్లో కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్నట్లుగా తెలివిగా ఎస్కేప్ అవుతున్నాడు.
మరోవైపు రష్మిక కూడా ఈ విషయంలో స్పందించాల్సి వస్తోంది. కెరీర్‌లో నిలదొక్కుకోవడానికి పెళ్లి ఆటంకం కాకూడదన్న అభిప్రాయంతోనే మేమిద్దరం ఓ అండర్ స్టాండింగ్‌తో విడిపోయామని రష్మిక చెప్పుకొస్తోంది. ఇలా ఇద్దరికిద్దరూ తమ బ్రేకప్ విషయాన్ని అసలు సంగతి బయటికి రాకుండా కేర్‌ఫుల్‌గా డీల్ చేస్తున్నారు. ఏది ఏమైతేనేం, ఈ ఇష్యూ 'అతడే శ్రీమన్నారాయణ'కు వర్కవుట్ అవుతుందో.? లేదో.? తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.