పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లోకి వచ్చింది. తొలి సినిమా లేటుగా రిలీజైతే, రెండో సినిమా ముందుగా ప్రేక్షకులను అలరించింది. అదే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. మధ్యలో ఒకట్రెండు ఫ్లాప్ చిత్రాలున్నా ఓవరాల్‌గా రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అని చెప్పక తప్పదు. 2016 అయితే రకుల్ ప్రీత్ సింగ్‌కి వెరీ వెరీ స్పెషల్. గత సంక్రాంతికి వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, మొత్తం 2016లో 3 సూపర్ హిట్స్‌ని నమోదు చేసింది. మిగతా రెండు చిత్రాలు 'సరైనోడు', 'ధృవ'. గ్లామర్ ప్లస్ పెర్ఫామెన్స్ అదీ రకుల్ ప్రత్యేకత.
నాన్నకు ప్రేమతో
ఎన్టీయార్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో రకుల్ చాలా గ్లామరస్‌గా కనిపించింది. క్యూట్ లుక్స్‌తో అలరించింది. అంతేకాదు ఈ సినిమాతో తొలిసారిగా రకుల్ తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. దాంతో తెలుగు వారికి మరింత దగ్గరైపోయింది. తన క్యూట్ వాయిస్‌తో ఫ్యాన్స్‌ని మెప్పించింది. హీరోయిన్ అంటే పాటలు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు పెర్ఫామెన్స్‌తోనూ ఆకట్టుకోవాలి. అలాక్కూడా ఆకట్టుకోగలనని ప్రూవ్ చేసుకుంది ఈ సినిమాతో రకుల్. స్టైలిష్ లుక్‌తో ఉన్న ఎన్టీఆర్‌కి స్టైలిష్ జోడీగా మంచి మార్కులు కొట్టేసింది. మొత్తానికి ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
సరైనోడు
అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్టర్‌గా తెరకెక్కింది ఈ సినిమా. 'నాన్నకు ప్రేమతో' క్లాస్ సినిమా అయితే, 'సరైనోడు' మాస్ సినిమా. మాస్ పాటలకి అద్భుతమైన డాన్సులేసి రచ్చ రచ్చ చేసేసింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. అల్లు అర్జున్‌తో సమానంగా డాన్సులేసి టాపు రేపేసింది. గ్లామర్‌తో కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసిందీ బ్యూటీ. డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకుంది ఈ సినిమాలో రకుల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా ఇది. అందుకే భారీ అంచనాల నడుమ విడుదలయ్యి, సెన్సేషనల్ హిట్‌నిచ్చింది. కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా రకుల్‌కి 'సరైనోడు' సినిమా నిలిచింది.
'ధృవ'
ఇది ఓ విలక్షణమైన చిత్రం. తమిళంలో వచ్చిన 'తని ఒరువన్'కి ఇది తెలుగు రీమేక్. ఒరిజినల్‌లో సీనియర్ హీరోయిన్ నయనతార నటిస్తే, ఆ పాత్రను సవాల్‌గా తీసుకుని సత్తా చాటింది రకుల్ ప్రీత్ సింగ్ 'ధృవ'లో. పరేషానురా పాటతో అందాల విందు చేసింది, అది కూడా అందంగానే. ఈ పాటలో రకుల్ అప్పియరెన్స్‌ని మెచ్చుకోని సినీ జనం లేరు. ఆమె అభిమానులయితే ఈ పాటలో రకుల్ గ్లామర్‌ని చూసి నిజంగానే పరేషాన్ అయిపోయారు. రామ్‌చరణ్‌తో ఇంతకు ముందు 'బ్రూస్‌లీ' సినిమా చేసి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ బ్యూటీ, ఈసారి మాత్రం ఘనవిజయాన్ని అందుకుంది. సురేందర్‌రెడ్డి దర్శకుడు ఈ చిత్రానికి. ఇటు చరణ్‌తో, అటు సురేందర్‌రెడ్డితో రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇది రెండో సినిమా. అంతే కాదు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రకుల్‌కి ఇది రెండో సినిమా. ఇన్ని డబుల్ స్పెషాలిటీస్ ఉన్న ఈ సినిమాతో రకుల్‌కి డబుల్ సక్సెస్ వచ్చింది.
ఇలా ఈ ఏడాది మూడు డిఫరెంట్ సబ్జెక్ట్ సినిమాలతో వచ్చి రకుల్ హ్యాట్రిక్ బ్యూటీ అయ్యింది. వచ్చిన హిట్స్ కూడా మామూలువి కావు. సెన్సేషనల్ హిట్ సినిమాలు. అంతేకాదు స్టార్ హీరోల సినిమాలు కావడం రకుల్ అదృష్టం. అందుకే ఈ ఇయర్ రకుల్‌కి వెరీ వెరీ స్పెషల్.