చరణ్ - బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇంతవరకూ రకుల్ ప్రీత్‌సింగ్‌ని అనుకున్నారు. అయితే ఆ ప్లేస్‌లోకి ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ వచ్చి చేరినట్లుగా తెలుస్తోంది. రకుల్‌ని కాదనీ అనూ ఇమ్మాన్యుయేల్‌ని దాదాపుగా కన్‌ఫామ్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఇంతవరకూ స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రకుల్ ప్రీత్‌సింగ్ కెరీర్ టాలీవుడ్‌లో కొంచెం స్లో అయ్యిందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే ఆమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలేమీ లేవనే చెప్పాలి. తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి సూర్య హీరోగా తెరకెక్కుతోంది. మరోటి కార్తితో. ఈ రెండు సినిమాలు తప్ప రకుల్ చేతిలో ఇతర ప్రాజెక్టులు లేవనే చెప్పాలి. అయితే తాజాగా చరణ్ - బోయపాటితో ఛాన్స్ మిస్ చేసుకోవడంతో ఆమె అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారు.
ఇదిలా ఉండగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో రకుల్ తాజాగా ఛాన్స్ దక్కించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంత నిజముందో తెలీదు కానీ, ప్రస్తుతానికి మాత్రం తెలుగులో రకుల్ కెరీర్ బాగా స్లో అయిన మాట వాస్తవమే. మరో పక్క చరణ్ నటిస్తోన్న 'రంగస్థలం' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తి కాగానే చరణ్ తన గెటప్‌ని మొత్తం మార్చేసుకోనున్నాడు బోయపాటి సినిమా కోసం. 'రంగస్థలం' కోసం పల్లెటూరి కుర్రోడిలా గెడ్డం పెంచి, మాస్ మెచ్చే కొత్త గెటప్‌లో కనిపిస్తున్న చరణ్ మళ్లీ బోయపాటి సినిమా కోసం కండలు పెంచనున్నాడట. మోడ్రన్ టచ్ ఉన్న మాస్ లుక్‌లోకి మారిపోనున్నాడట.
కాగా ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే, ఇప్పటికే ఈ బ్యూటీ ఇటు పవన్ కళ్యాణ్ సినిమాలోనూ, అటు అల్లు అర్జున్ సినిమాలోనూ నటించేస్తోంది. అంతేకాదు, ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ బ్యూటీనే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా, కొత్తగా చరణ్‌తో ఆఫర్ కన్‌ఫామ్ అయ్యేలా ఉంది. ఇవే కాక జక్కన్న తెరకెక్కించబోయే మల్టీ స్టారర్ కోసం కూడా ఈ అమ్మడినే పరిశీలిస్తున్నట్లుగా సమాచారమ్.