టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ న్యూ ఇయర్‌లో ఓ కొత్త నిర్ణయాన్ని తీసుకుందట. అందేంటో తెలుసా?
ఇకపై ఈ బ్యూటీ నటించే తెలుగు సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందట. అదిరిపోయింది కదా. ఈ తరం హీరోయిన్స్‌లో అతి తక్కువ కాలంలోనే తెలుగు నేర్చుకుని, తెలుగులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడంలో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ మిగిలిన అప్ కమింగ్ హీరోయిన్స్‌కి ఆదర్శంగా నిలిచింది. మాతృభాష పంజాబీ అయినా, తెలుగు భాషపై ఉన్న మక్కువతో తెలుగు నేర్చుకుంది.
'నాన్నకు ప్రేమతో' సినిమాలో తొలి సారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గతేడాది 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో 'భ్రమరాంబ' పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో 'అయ్యారీ' సినిమాలో నటిస్తోంది. సిద్దార్డ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ముద్దుగుమ్మ రకుల్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే న్యూ ఇయర్ సందర్భంగా తాను తీసుకున్న ఈ కొత్త నిర్ణయాన్ని ఆడియన్స్‌తో పంచుకుంది. భలే నిర్ణయం తీసుకుందిలే రకుల్ అని అంతా మెచ్చుకుంటున్నారు.
ఈ తరం హీరోయిన్స్ ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు, సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేయాలనే తపనతోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలాగే తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంటున్నారు. తొలి సినిమాకే సాయి పల్లవి తెలంగాణా యాసలో మాట్లాడి ఆకట్టుకుంది. తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ 'అజ్ఞాతవాసి' కోసం తెలుగులో డబ్బింగ్ చెప్పి, అందరి మెప్పు పొందుతున్నారు. భాష తెలిస్తే, నటించడం ఇంకా సులువవుతుందని భావిస్తున్నారు. దాంతో భాషపై పట్టు సాధిస్తున్నారు. అవకాశాలతో పాటు మంచి విజయాలు కూడా అంది పుచ్చుకుంటున్నారు.