హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రాజకీయాల్లోకి వస్తోంది.. అయితే, అది నిజ జీవితంలో కాదు. సినీ జీవితంలో. ఏమో, భవిష్యత్తులో కూడా రకుల్ ప్రీత్ సింగ్‌ని రాజకీయాల్లో చూసే అవకాశం వుంటుందేమో. నగ్మా, విజయశాంతి, ఖుష్బూ, ఊర్మిళ, రోజా.. ఇలా చాలామంది ఇప్పటికే రాజకీయాల్లో వున్నారనుకోండి. అది వేరే సంగతి. అసలు విషయమేంటంటే తన తాజా సినిమా 'ఎన్‌జికె' ప్రమోషన్స్‌లో బిజీగా వుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమా కోసం రాజకీయ నాయకురాలిగా అవతారమెత్తిన రకుల్ ప్రీత్ సింగ్, రాజకీయాల పట్ల ప్రతి ఒక్కరిలోనూ అవగాహన వుండాలని చెబుతోంది.
'రాజకీయ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి. దేశ రాజకీయాల్ని అర్థం చేసుకోవాలి. మంచి చేసినవారిని ఎన్నుకోవాలి. నా వరకు నేనూ బాద్యతగా వ్యవహరిస్తాను. ఇప్పటికైతే రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన లేదు. కానీ, రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే వుంటాను' అని చెప్పింది రకుల్ ప్రీత్ సింగ్. సూర్య సరసన రకుల్ హీరోయిన్‌గా నటించిన 'ఎన్‌జికె' విడుదలకు సిద్ధమైన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా వుంటుందనీ, రాజకీయ నాయకురాలి తరహా పాత్ర పోషించడం ఇదే తొలిసారి అనీ రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది.