కథానాయికల ప్రేమ - పెళ్లి అనేవి ఎప్పుడూ హాట్ టాపిక్కులే. ముఖ్యంగా ఎవరైనా, ఎవరితోనైనా ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నా, ఒకటికి నాలుగు సార్లు... కలిసి మెలిసి మీడియాకు కనిపించినా, ప్రేమ, పెళ్లి కథలు అల్లేస్తారు. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి బంధం గురించి రకుల్ నే ఇటీవల ప్రకటించింది. ఈమధ్య వీరిద్దరూ ఎక్కువగా కలిసి మెలిసి తిరుగుతున్నారు. దాంతో మీడియా ఫోకస్ వీళ్లపై ఎక్కువగా పడింది. రకుల్ కి పెళ్లి అయిపోయిందని కొందరు, అతి త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారని మరి కొందరు పుకార్లు సృష్టించేస్తున్నారు. దీనిపై రకుల్ తనదైన స్టైల్ లో స్పందించింది. చేతిలో పది సినిమాలున్నాయి, ఇప్పుడు పెళ్లి అవసరమా? అంటూ కౌంటర్ వేసింది.
''ఇలాంటి అసత్య ప్రచారాన్ని నేను పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకునిపోతుంటాను. దయచేసి నన్ను ఇబ్బందులకు గురిచేయొద్దు. ఇప్పుడు పది సినిమాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాను. నా ధ్యాసంతా వాటిపైనే ఉంది. జాకీ భగ్నానీతో నేను ప్రేమలో పడిన విషయాన్ని ఏ విధంగా బహిరంగంగా వెల్లడించానో, అదే విధంగా మా పెళ్ళి విషయాన్ని కూడా ఓపెన్‌గానే చెబుతాను. మరీ ముఖ్యంగా మీడియాకు చెప్పిన తర్వాతే పెళ్ళి చేసుకుంటాను'' అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. సో... రకుల్ పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెర పడినట్టే.