డ్రగ్స్ కేసులో తెలుగు కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే. శుక్రవారం రకుల్ ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరైంది. రకుల్ ని మూడు గంటల సేపు ప్రశ్నించారు ఎన్‌సీబీ అధికారులు. ఈ సందర్భంగా రకుల్ నుంచి ఎన్ సీ బీ అధికారులు కీలకమైన సమాచారం అందించినట్టు తెలుస్తోంది. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, అయితే డ్రగ్స్ మాత్రం తన ఇంట్లో దాచి పెట్టిందట, అది కూడా రియా కోరిక మేరకు. అంతే తప్ప తనకు ఏ డ్రగ్ డీలర్ తోనూ పరిచయం లేదని, తానెప్పుడూ డ్రగ్స్ డీలర్లతో మాట్లాడలేదని రకుల్ చెప్పిందట.
అయితే.. ముంబైలోని రకుల్ ఫ్లాట్స్, కార్యాలయంలో డ్రగ్స్ ప్యాకెట్లని అధికారులు స్వాధీనం చేసుకున్నారని వార్తలొస్తున్నాయి. ఆ డ్రగ్స్ రియావే అని, స్నేహితురాలి కోసం తాను దాచి పెట్టానని రకుల్ చెబుతోంది. రకుల్ డ్రగ్స్ వాడిందా? లేదా? అనే విషయాలు రాబట్టడానికి అధికారులు రకుల్ రక్త నమూనాలను లాబ్ కి పంపించారని తెలుస్తోంది. డ్రగ్స్ తీసుకోకపోయినా, డ్రగ్స్ కలిగి ఉండడం కూడా పెద్ద నేరమే. దాంతో ఈ కేసులో రకుల్ పీకల్లోతు మునిగిపోయినట్టే అనిపిస్తోంది.