ఒకటా, రెండా...? వందా? వేయా? ఏకంగా 50 వేల పాటలు. అన్ని భాషల్లోనూ శ్రోతల్ని ఉర్రూతలూగించిన గొంతు అది. ఆఖరికి లిపి లేని భాషల్లోనూ పాటలు పాడి - గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన శిఖర సమానుడు. ఇంకెవరు.. మన బాలు. ఆయన్నుంచి మరో కొత్త పాట రాదన్న సంగతి... హృదయాల్ని ద్రవింపజేస్తోంది. అయితే... ఆయన మొదటి పాట ఏది? చివరి పాట ఏది? అన్న విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. 1966లో బాలు తొలిసారి గళం విప్పారు. 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రం కోసం. ఎస్‌పి కోదండపాణి సంగీతం అందించారు.
నటుడు, నిర్మాత పద్మనాభం చిత్రాన్ని నిర్మించారు. ఇందులో గాయని పి.సుశీలతో కలిసి "ఏమి వింత మోహం" అనే పాటను బాలు ఆలపించారు. ఆయన చివరి పాట 'పలాస 1978' సినిమాలో 'ఓ సొగసరి' అనేది. పలాస బేబీతో కలిసి ఈ పాట పాడారాయన. లక్ష్మి భూపాల రాసిన ఈ పాటకు రఘు కుంచె సంగీతం అందించారు. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైపోయినప్పుడు.. ఫేస్ బుక్ ద్వారా అభిమానులు కోరిన పాటల్ని ఆలపించారు బాలు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని ఓ ట్రస్ట్ కోసం కేటాయించడం విశేషం. ఆసుపత్రి పడక పై కూడా ఆయన పాటలు వింటూ, పాడుతూ గడిపారని తనయుడు చరణ్ ఇది వరకే చెప్పారు.