మోహన్‌బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం `సన్నాఫ్ ఇండియా`. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఓ కీలకమైన పాత్ర చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. వీటిపై రకుల్ మేనేజర్ స్పందించారు. రకుల్ చేస్తున్న సినిమాలపై క్లారిటీ ఇచ్చారు. అవి మినహా కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదని తేల్చి చెప్పారు.
‘ప్రస్తుతం తెలుగులో ‘చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా నటిస్త్తున్న ‘చెక్'లో లాయర్‌గా శక్తివంతమైన పాత్రలో రకుల్ కనిపిస్తుంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో పల్లెటూరి యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించబోతున్నది. తమిళంలో శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్‌లో జాన్ అబ్రహమ్ ‘అటాక్'తో పాటు అర్జున్‌కపూర్ సినిమాల్లో రకుల్ భాగంకానుంది. అజయ్‌దేవ్‌గణ్, అమితాబ్‌బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించనున్న ‘మేడే’ చిత్రాన్ని ఇటీవలే అంగీకరించింది. ఆసక్తికరమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రాల్లో అత్యుత్తమ నటనను ప్రదర్శిస్తూ తన పాత్రలకు పరిపూర్ణంగాన్యాయం చేయాలనే తపనతో రకుల్‌ప్రీత్‌సింగ్ శ్రమిస్తోంది. ఈ సినిమాలు మినహా కొత్త చిత్రాలేవీ ఆమె అంగీకరించలేదు’ అని రకుల్ టీమ్ వెల్లడించారు.