రామ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్.. `ఇస్మార్ట్ శంకర్`. ఈ సినిమాతో రామ్ కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రామ్ ని ఇలా క్కూడా చూపించొచ్చు.. అనే విషయం ఈతరం దర్శకులకు అర్థమైంది. ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కి మర్చిపోలేని విజయాన్ని అందించాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు రామ్ ఆ రుణం తీర్చేసుకున్నాడు.
పూరి తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా `రొమాంటిక్` సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శుక్రవారం విడుదల అవుతోంది. ఆకాష్ కి ఈ సినిమా హిట్ కొట్టడం చాలా అవసరం. పైగా ఈసినిమాకి పూరి నిర్మాత కూడానూ. అందుకే రామ్ ఈ సినిమాకి తన వంతు సహాయం చేశాడు. ఈసినిమాలోని ఓ పాటలో రామ్ తళుక్కున మెరిశాడు. గోవా బీచ్ లో తెరకెక్కించిన `పీనేకీ బాద్` పాటలో రామ్ స్టెప్పులు వేశాడు. ఇదే పాటలో పూరి జగన్నాథ్ కూడా కనిపిస్తాడు. అలా ఈ ఇద్దరూ `రొమాంటిక్`కి మరింత క్రేజ్ తీసుకొచ్చేశారు. అనిల్ పాడూరి దర్శకత్వం వహించిన సినిమా ఇది. కేతిక శర్మ కథానాయికగా నటించింది. ఇప్పటికే పాటుల, ప్రచార చిత్రాలతో పబ్లిసిటీ హోరెత్తించేశారు. ప్రభాస్ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్ ఇచ్చాడు. ఇప్పుడు రామ్ కూడా తన వంతు సాయం చేశాడు. ఇవన్నీ ఈ సినిమా ఓపెనింగ్స్ రావడానికి ఎంత వరకూ దోహదం చేస్తాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.