చిరంజీవి - రామ్ చరణ్ ఇది వరకు వెండి తెరపై ఒకేసారి కనిపించి సందడి చేశారు. మగధీర, ఖైదీ నెం.150లలో అది సాధ్యమైంది. అయితే ఆ రెండు సార్లూ... గెస్ట్ రోల్స్‌కే పరిమితయ్యారు తండ్రీ కొడుకులు. ఈసారి `ఆచార్య`లో మాత్రం పూర్తి స్థాయి పాత్రలు పోషించారు. ఆచార్య చిరంజీవి సినిమానే అయినప్పటికీ చరణ్ పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు 45 నిమిషాల పాటు చరణ్ పాత్ర సాగుతుంది. సెకండాఫ్ లో ఈ పాత్ర చాలా కీలకంగా మారబోతోంది.
చిరు - చరణ్‌లు కలిసి ఓ పాటలోనూ స్టెప్పులు వేయబోతున్నారు. ఈ పాట చేసేటప్పుడు చరణ్ చాలా టెన్షన్ పడ్డాడట. చరణ్ మంచి డాన్సర్. కాకపోతే.. చిరుతో స్టెప్పులు వేయాలంటే వణికి పోవాల్సిందే. చరణ్‌కీ ఆ అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని చరణే స్వయంగా చెప్పాడు. ``నాన్నతో డాన్స్ అనగానే నాకు చమటలు పట్టేశాయి. ఆయన బాడీలోని ప్రతీ అణువూ డాన్స్ చేస్తుంటుంది. ఆయనతో మ్యాచ్ చేయడం ఇంపాజిబుల్. అందుకే.. నేను చాలా ప్రాక్టీస్ చేసి సెట్ కి వెళ్లేవాడ్ని. `ఏరా.. నన్ను డామినేట్ చేయాలనుకుంటున్నావా` అని సరదాగా అడిగేవారు. సెట్లో మా ఇద్దరి డాన్స్ చూడడానికి అమ్మ, అమ్మమ్మ వచ్చారు. వాళ్లని చూస్తే ఇంకాస్త టెన్షన్ వచ్చింది. `నా కొడుకు బాగా చేస్తున్నాడు చూడు` అని అమ్మమ్మ అంటే.. `నా కొడుకు కూడా ఏం తక్కువ తినలేదు` అని అమ్మ అనేది. ఇలా.. వాళ్ళిద్దరూ తమ కొడుకుల గురించి గొప్పగా చెప్పుకుంటే.. చాలా గర్వంగా అనిపించేది`` అని ఆ ముచ్చట్లని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. `ఆచార్య` ఈనెల 29న వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో.. `భలే బంజారా` పాటకు చిరు, చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు.