బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం జత కడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ తెరకెక్కలేదట. త్వరలోనే వీరిద్దరి కాంబో సీన్స్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న చరణ్‌కి భార్య సీత పాత్రలో అలియా నటిస్తోంది. అలియా అంటే తనకెంతో అభిమానమనీ, ఆమె నటన చాలా బాగుంటుందనీ, ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాననీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ వెల్లడించారు.
మరోవైపు 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్న మరో జంట తారక్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్. ఈ జంటపై ఆల్రెడీ కొన్ని సీన్లు చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది. చరిత్ర ప్రకారం, కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ఓ విదేశీ భామతో లవ్‌లో పడతాడు. ఆ విదేశీ భామ పాత్రలోనే ఒలివియా నటిస్తోంది. వీరిద్దరి మధ్యా కొన్ని ప్రేమ సన్నివేశాలు, ఓ సాంగ్ చిత్రీకరణ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నుండి అజయ్ దేవగణ్, కోలీవుడ్ నుండి సముద్రఖని వంటి స్టార్ హీరోలు నటిస్తున్నారు. రీ స్టీవెన్‌సన్ తదితర హాలీవుడ్ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.