హీరోగా బిజీగా ఉంటూనే మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఇంకోవైపు తండ్రి చిరంజీవి కోసం నిర్మాతగా మారి, సరికొత్త సినిమాలు రూపొందిస్తున్నాడు. మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'తో మంచి విజయం అందుకుని, ఇప్పుడు ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా' రూపొందించాడు. ఇక త్వరలోనే మరో చిత్రానికీ సన్నద్ధమవుతున్నాడు. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్' సినిమా హక్కుల్ని లేటెస్ట్‌గా రామ్‌చరణ్ కొనుగోలు చేశాడట.
ఈ విషయాన్ని ఆ సినిమాలో నటించిన హీరో కమ్ దర్శకుడు పృధ్వీరాజ్ అఫీషియల్‌గా తెలిపారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో పృధ్వీరాజ్ కీలక పాత్ర పోషించడంతో పాటు, దర్శకత్వం కూడా వహించిన ఈ సినిమా రీమేక్ హక్కుల్ని చిరంజీవి కోసం చరణ్ దక్కించుకున్నాడట. అంతేకాదు, ఈ సినిమాలో మోహన్‌లాల్ పాత్రను చిరంజీవి పోషించగా, పృధ్వీరాజ్ పాత్రను చరణ్ పోషించనున్నాడనీ తెలుస్తోంది.
అంటే ఈ తండ్రీ కొడుకుల కాంబినేషన్‌లో రానున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కానుందన్న మాట ఈ సినిమా. అయితే, ఇంత గొప్ప మల్టీ స్టారర్‌కి దర్శకత్వం వహించే అదృష్టం ఎవరికి దక్కనుందో చూడాలి మరి. ఇకపోతే, ప్రస్తుతం చరణ్ - ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్' మల్టీ స్టారర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూలై 30కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సైరా' తర్వాత చిరంజీవి కొరటాల శివ సినిమాలో నటిస్తారు. బహుశా ఈ తాజా రీమేక్ ఆ తర్వాత పట్టాలెక్కనుందేమో.