150 రోజుల కష్టం ఫలించింది. అంచనాలను అందుకోవడంలో 'సైరా' ఆకాశాన్ని తాకింది. ప్రీమియర్స్ భళా అన్నాయి. ఇక ఒరిజినల్ రిజల్ట్ బద్దలైపోయింది. 'సైరా' ఓపెనింగ్ డే మేనియాని తట్టుకోవడం బాక్సాఫీస్ వల్ల కాలేదు. ఎట్టకేలకు 'సైరా' విజయవంతమైంది. చరిత్రను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా కాబట్టి అక్కడక్కడా కొన్ని వంకలున్నప్పటికీ, చిరంజీవి డెడికేషన్, యాక్టింగ్, సురేందర్ రెడ్డి టేకింగ్, చరణ్ నిర్మాణ విలువల ముందు అవన్నీ చిన్నవైపోయాయి.
'సైరా'ని ఇంతలా ఆదరించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, అభిమానులకు ధన్యవాదాలు చెప్పాడు నిర్మాత రామ్‌చరణ్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఆయన మాకు అన్నీ ఇచ్చారు. మళ్లీ 'బాస్ బస్టర్' అందించినందుకు మీకు ధన్యవాదాలు డాడీ..' అంటూ తండ్రి చిరంజీవితో ఆప్యాయంగా దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. చరణ్‌ని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ఫోటో ఒకటి, ప్రేమతో ముద్దాడుతున్న ఫోటో ఒకటి.
ఈ ఫోటోలు చూస్తుంటే, పుత్రోత్సాహం అంటే ఇదే అనిపిస్తోంది. ఇంతకన్నా అభిమానులకు ఇంకేం కావాలి అనిపిస్తోంది. అసలు సిసలు దసరా పండగ ముందే వచ్చేసింది ఫ్యాన్స్‌కి 'సైరా నరసింహారెడ్డి'తో. సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్ వద్ద మెగా అభిమానుల కోలాహలం కనీ వినీ ఎరుగని రీతిలో ఉంది.