ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్` షూటింగులో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. మరోవైపు `ఆచార్య` సెట్లోనూ అడుగుపెట్టాలనుకుంటున్నాడు. అయితే... రాజమౌళి అనుమతి ఇంకా దొరకలేదు. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఆచార్య`లో చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో చరణ్ కనిపిస్తాడు. ఆయా సన్నివేశాల్ని తెరకెక్కిస్తే.. మేజర్ షూటింగ్ పూర్తయినట్టే. అయితే.. చరణ్ అడుగుపెట్టాలంటే రాజమౌళి అనుమతి తప్పనిసరి.
`ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ నుంచి కొంత విరామం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చరణ్‌కి జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. `ఆర్.ఆర్.ఆర్` షూటింగులో పాల్గొనడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పేశాడట. దాంతో.... ఆచార్య సెట్లో రామ్ చరణ్ అడుగుపెట్టడానికి మార్గం సుగమం అయ్యింది. సంక్రాంతి తరవాత.. చరణ్ సెట్లోకి వస్తాడని, ఒకే ఒక్క షెడ్యూల్ లో చరణ్‌కి సంబంధించిన సన్నివేశాలన్నీ పూర్తి చేస్తారని తెలుస్తోంది.
చిరు కూడా అతి త్వరలో ఈ షూటింగులో పాల్గొనబోతున్నాడు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. 2021 వేసవిలో ఈచిత్రాన్ని విడుదల చేస్తారు.