ఎన్టీఆర్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల... ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అదే కథతో బుచ్చిబాబు రామ్ చరణ్‌ని అప్రోచ్ అవ్వడం, దానికి రామ్ చరణ్ `ఓకే` అనడం జరిగిపోయాయి. ఎన్టీఆర్ సినిమా.. చరణ్ చేతిల్లోకి వెళ్లిపోయింది. అయితే... ఈ ప్రాజెక్టు విషయంలో రామ్ చరణ్ చూపించిన ప్రొఫెషనలిజం.. టాలీవుడ్ వర్గాల మనసుల్ని గెలుచుకొంటోంది.
ఉప్పెన అయిపోయిన వెంటనే.. ఎన్టీఆర్ కి కథ చెప్పి, తన రెండో సినిమా ఓకే చేయించుకొన్నాడు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కోసం `పెద్ది` అనే కథ కూడా రెడీ చేశాడు. ఈ కథ ఎన్టీఆర్‌కి బాగా నచ్చింది. కొరటాల శివ సినిమా అవ్వగానే.. బుచ్చిబాబు సినిమా మొదలెడదాం అనుకొన్నాడు. కానీ... కొరటాల సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కోసం రెడీగా ఉంటాడు. సో.. బుచ్చిబాబుకి వెంటనే డేట్లు ఇవ్వడం కుదరదు. బుచ్చి మరో యేడాదైనా ఆగాల్సి ఉంటుంది. అందుకే.. బుచ్చి మరో ఆప్షన్ చూసుకొన్నాడు. రామ్ చరణ్‌కి కథ చెప్పాడు. కథ చరణ్‌కీ బాగా నచ్చింది. అయితే వెంటనే ఓకే చేయలేదు. వెంటనే ఎన్టీఆర్ టచ్‌లోకి వెళ్లాడు చరణ్. ''బుచ్చి కథ నా దగ్గరకు వచ్చింది. బాగా నచ్చింది. నువ్వు `ఓకే` అంటే చేస్తా'' అన్నాడట. దాంతో ఎన్టీఆర్ కూడా ''ఈ కథ మనిద్దరిలో ఎవరు చేసినా బాగానే ఉంటుంది.. ప్రొసీడ్'' అన్నాడట. అలా ఎన్టీఆర్ పర్మిషన్ తీసుకొన్న తరవాతే చరణ్ ఈ సినిమాని ఓకే చేశాడని టాక్. ఆర్.ఆర్.ఆర్‌తో.. చరణ్, ఎన్టీఆర్‌ల బాండింగ్ బలపడింది. అలాంటి తరుణంలో ఎన్టీఆర్ కథని లాక్కుని చేశానన్న చెడ్డ పేరు తనకి రావొద్దనుకొన్నాడు చరణ్. అందుకే ఇంత ముందు జాగ్రత్త.