మెగా హీరోల్లో చాలా బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఓ పక్క హీరోగా నటిస్తూనే మరో పక్క తండ్రి సినిమా కి నిర్మాతగానూ వ్యవహరిస్తూ అస్సలు టైం లేకుండా గడుపుతున్నాడు. సుకుమార్‌తో చరణ్ 'రేపల్లె'(వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తున్నాడు. మరోపక్క చిరంజీవి 151వ సినిమా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా చాలా ప్రతిష్ఠాత్మకమైనది. ఎంతో భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కూడా. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ విషయంలో చరణ్ భార్య ఉపాసన చరణ్‌కి తగిన సూచనలు, సలహాలు అందిస్తోంది. టైమ్ మేనేజ్మెంట్ విషయంలో ఉపాసన సలహాలు, సూచనలు చరణ్‌కి బాగా వర్కవుట్ అవుతున్నాయట. అంతేకాదు 'ధృవ' సినిమా టైంలో కూడా చరణ్ ఇలాగే కష్టపడ్డాడు. ఓ పక్క 'ధృవ' షూటింగ్లో పాల్గొంటూనే మరో పక్క చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ..' కోసం కూడా కసరత్తులు చేశాడు నిర్మాతగా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే అప్పటితో పోలిస్తే, ఇప్పుడు ఈ సినిమా ఇంకా ప్రత్యేకం. తాను హీరోగా చేస్తున్న సినిమా కూడా ప్రయోగాత్మక చిత్రమే. అలాగే ఉయ్యాలవాడ సినిమా చారిత్రాత్మకమైనది. సో చరణ్ రెండు పక్కలా చరణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఆగష్టులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా పట్టాలెక్కనుది. ఈ లోగానే ఈ సినిమాకి సంబంధించిన టెక్నికల్ టీమ్, కాస్టింగ్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారట. సినిమా స్టార్ట్ అవ్వడమే లేటు. ఒక్కసారి సినిమా పట్టాలెక్కిందంటే, షూటింగ్ పరుగులు పెట్టించేయనున్నారట. అప్పటిలోగా చరణ్ - సుకుమార్ సినిమా షూటింగ్ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.