ఎన్నో ఏళ్ళ క్రితమే చిరంజీవి చేయాల్సిన సినిమా 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి'. ఆయన కోసమే ఆ సినిమా ఇంతవరకూ ఆగిపోయింది. పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశారు. కథ మొత్తం వారే రూపొందించారు. అయితే దానికి ఇప్పుడు సురేందర్‌రెడ్డి మెరుగులు దిద్దుతున్నాడు. దాదాపుగా కథ ఫైనల్ అయిపోయినట్లుగా సమాచారమ్ అందుతోంది. అయితే ముందుగా మార్కెటింగ్ గురించిన సమాలోచనలు ప్రారంభించారట. ఎందుకంటే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' అనే వ్యక్తి తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు. ఆయన జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిల్చేలా ఉండాలని తద్వారా బాలీవుడ్ దృష్టిని ఆకర్షించవచ్చునని చిరంజీవి భావిస్తున్నారట. నిర్మాత రామ్‌చరణ్ కూడా, హడావిడిగా సినిమా చేసెయ్యకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేయడమే మంచిదని దర్శకుడు సురేందర్‌రెడ్డికి సూచించినట్లు తెలియవస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటుల్ని కూడా ఇన్‌వాల్వ్ చేయాలోనే ఆలోచన కూడా చేస్తున్నారట. తొమ్మిదేళ్ళ క్రితం ఈ సినిమాకి వినాయక్ దర్శకుడు అనే టాక్ వినవచ్చింది. అయితే వినాయక్‌తో కమర్షియల్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' ఇటీవలే చేసిన చిరంజీవి, ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'ని 'ధృవ' ఫేం సురేందర్‌రెడ్డి చేతిలో పెట్టారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.