బాక్సాఫీసు కళకళలాడింది. ఈ వారం తెలుగు నుంచి మూడు సినిమాలొచ్చాయి. జానూ, సవారీ, త్రీమంకీస్ ప్రేక్షకుల్ని పలకరించాయి. మరి ఈ మూడుచిత్రాల్లో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న సినిమా ఏది??
ఈ వారం ఎన్ని సినిమాలొచ్చినా ప్రేక్షకుల దృష్టి మాత్రం `జానూ`పైనే ఉంది. ఎందుకంటే ఇది తమిళ సూపర్ హిట్ సినిమా `96`కి రీమేక్ ఇది. శర్వానంద్, సమంత జంటగా నటించారు. దిల్ రాజు నిర్మించారు. మాతృక తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ ఈ రీమేక్‌కీ దర్శకత్వం వహించారు. తమిళ కథని కట్, కాపీ, పేస్ట్ చేశారంతే. మార్పులకు సాహసించలేదు. 96 రీమేక్ చూసిన వాళ్లకు జానూ పెద్దగా నచ్చకపోవొచ్చు. కానీ ఓ తెలుగు సినిమాలా చూస్తే మాత్రం తప్పకుండా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. శర్వా, సమంతల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇద్దరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. సంగీతం కూడా హాయిగా సాగింది. తక్కువ బడ్జెట్‌లో రూపొందించిన సినిమా ఇది. తొలి మూడు రోజుల వసూళ్లతో పెట్టుబడి తిరిగి వచ్చేయొచ్చు. ఇక శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో వచ్చేదంతా లాభమే అనుకోవాలి.
మిగిలిన రెండు సినిమాల్నీ ప్రేక్షకుల అస్సలు పట్టించుకోలేదు. నందు కథానాయకుడిగా నటించిన సవారీ.. కథ, కథనాలు సరికొత్తగా లేకపోవడం తేలిపోయింది. అయితే నందు నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇక జబర్‌దస్త్ బ్యాచ్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాం ప్రసాద్ కథానాయకులుగా నటించి త్రీ మంకీస్ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఈ సినిమాకి 20 శాతం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం విచిత్రం అనిపించింది. ఇదే రోజున విడుదలైన డీగ్రీ కాలేజ్ అనే బీ గ్రేడ్ సినిమాకు మాత్రం అన్నో ఇన్నో వసూళ్లు రావడం గమనించదగిన విషయం.