'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి కేటీఆర్ వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కేటీఆర్ మంచి వక్త. అలాంటి వ్యక్తి కూడా... వేదికపై చరణ్ స్పీచ్ చూసి షాకయ్యాడు. 'మాకంటే చరణే బాగా మాట్లాడాడు. చూస్తుంటే.. చరణ్ రాజకీయాల్లోకి వచ్చేటట్టున్నాడు' అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు. స్టేజీపై ఆ మాట విని చిరు, చరణ్ చాలా సంబరపడిపోయారు. మరి 'రాజకీయాల్లోకి రావడం ఖాయమేనా' అని చరణ్‌ని అడిగితే ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.
బాగా మాట్లాడడం ఒక్కటే రాజకీయాలకు అర్హత కాదని, చిత్రసీమలో తనకంటే బాగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారని, రాజకీయాల్లో రాణించాలంటే అంకితభావం, సేవా దృక్పథం, అన్నింటికంటే విషయ పరిజ్ఞానం చాలా అవసరమని.. తేల్చి చెప్పాడు చరణ్. తన మాటల్ని బట్టి చూస్తే... రాజకీయాలకు చాలా దూరమన్న సంగతి అర్థమవుతూనే ఉంది. అయితే చిత్రసీమలోనూ, రాజకీయాల్లోనూ ఎప్పుడైనా ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కాకపోయినా.. చరణ్ ఎప్పుడైనా సరే...అటువైపుకు అడుగులేసే అవకాశాలున్నాయని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.